Tuesday 10 April 2012

వైయస్సార్‌పై మంత్రి కొండ్రు మురళి ఘాటు వ్యాఖ్యలు



హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై మంత్రి కొండ్రు మురళి మంగళవారం ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవి ఛానల్ నిర్వహించి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దళితులకు వైయస్ రాజశేఖర రెడ్డి చేసింది ఏమీ లేదని చెప్పారు. ఆయన పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెసు పార్టీలోనే దళితులకు న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు.

దళితులు, బహుజనులు కాంగ్రెసు పార్టీలోనే ఎదిగే అవకాశముందన్నారు. తెలుగుదేశం, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ద్వారా దళితులకు న్యాయం జరగదన్నారు. ఆ పార్టీలో వారు ఎదగలేరన్నారు. విలువ కూడా ఉండదని ఆరోపించారు.


వైయస్ హయాంలో దళితులకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని చెప్పిన కొండ్రు, ఆయనను పార్టీ నేతగానే భావిస్తామని చెప్పారు. రాష్ట్రానికి కాంగ్రెసు పార్టీ తరఫున పలువురు నేతలు ముఖ్యమంత్రిగా చేశారని చెప్పారు. వారందరికి ఎలాంటి గౌరవం ఇస్తున్నామో మా పార్టీ ముఖ్యమంత్రిగా ఆయనకు అదే గౌరవం ఇస్తామని చెప్పారు.

కాగా తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో దళితులు ఎదగలేరని, వారికి న్యాయం జరగదన్న కొండ్రు వ్యాఖ్యలను ఆయా పార్టీల నేతలు తప్పు పట్టారు. కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ధీటుగా ఎదుర్కోవాలంటే వైయస్‌ను పక్కన పెట్టాలని కాంగ్రెసు పార్టీ నేతలు భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment