Tuesday 10 April 2012

'రచ్చ' మూడు రోజుల కలెక్షన్స్


రచ్చ' చిత్రం తొలి మూడు రోజుల్లో రూ. 15 కోట్ల షేర్ సాధించిందని ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎన్.వి. ప్రసాద్ ప్రకటించారు. రాంచరణ్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్.బి. చౌదరి సమర్పణలో మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ఎన్.వి. ప్రసాద్, పారస్ జైన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ గురువారం అంటే ఈ నెల 5న 'రచ్చ' విడుదలైంది. ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకొని సోమవారం ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ వివరాలను తెలియచేసారు.


దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ "అద్భుతాలు సృష్టించే ముందు ఎవరూ గుర్తించరు. సృష్టించాక ఎవరూ గుర్తించాల్సిన పనిలేదు. సినిమా ఈ స్థాయి హిట్ కావడానికి ఒకే ఒక్క కారణం రాంచరణ్. 'రచ్చ' అంటేనే రాంచరణ్. నేను కళాఖండం తీయలేదు. కమర్షియల్ సినిమా తీశా'' అని చెప్పారు. మరో నిర్మాత పారస్‌జైన్ మాట్లాడుతూ "నాలుగు రోజుల కలెక్షన్ల విషయంలో పాత రికార్డుల్ని 'రచ్చ' తిరగరాసింది. రాంచరణ్ అంకితభావం వల్లే అనుకున్న సమయానికి సినిమా విడుదలైంది'' అన్నారు. 

ఎన్.వి. ప్రసాద్ మాట్లాడుతూ "తొలి నాలుగు రోజుల కలెక్షన్ల విషయంలో తెలుగులోని టాప్ సినిమాల్లో మా సినిమా స్థానం సంపాదించుకుంది. తమిళంలో ఈ నెల 6న 'రగళై' పేరుతో 280 థియేటర్లలో విడుదల చేస్తే దాని కలెక్షన్లకు తమిళ చిత్ర పరిశ్రమ షాక్‌కు గురయింది. మలయాళంలో 'రచ్చ' పేరుతోటే 13న విడుదల చేయబోతున్నాం. మూడు భాషల్లో కలిపి దక్షిణ భారతంలో 'రచ్చ' ఆల్ టైమ్ రికార్డ్‌గా నిలుస్తుందని ఆశిస్తున్నాం. ఈ విజయం మెగా అభిమానులదే'' అని చెప్పారు.

అనంతరం రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ "దర్శకుడు సంపత్ ఈ సినిమా కోసం సిన్సియర్‌గా పనిచేశాడు. మేం పనిచేసిన సినిమాల్లో 'ఒక్కడు' తర్వాత అంత సమష్టి పనితనం కనిపించిన సినిమా ఇదే. నా నటనకు ప్రశంసలు రావడం సంతోషంగా ఉంది'' అన్నారు. తమ బేనర్‌లోనే 'రచ్చ' బిగ్గెస్ట్ ఫిల్మ్ అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాకాడ అప్పారావు చెప్పారు. ఈ సమావేశంలో సినిమాటోగ్రాఫర్ సమీర్‌రెడ్డి, ఎడిటర్ గౌతంరాజు, కళాదర్శకుడు ఆనందసాయి, ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment